ఆంధ్రసమాచార్, కొత్తపేట : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేయడానికి ప్రజా దర్బార్ కార్యక్రమం వారధిగా పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెంలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. మౌలిక సౌకర్యాల కల్పన, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే ఎక్కువ వినతులు వచ్చాయన్నారు. వారానికి ఒకసారి నేరుగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను వినడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాదర్బార్ ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఏ శాఖకు చెందిన సమస్యలు ఆ శాఖ అధికారులకు పంపుతున్నామన్నారు. ప్రజల నుంచి అందిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 206 వినతులు అందాయి.

